రామవరం, సెప్టెంబర్ 22 : ఆర్థిక సంవత్సరం 2023-24 కు వచ్చిన లాభాల్లో సుమారు రూ.2 వేల కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం తీసి ఖర్చు చెప్పని సింగరేణి యాజమాన్యం, ఈ సంవత్సరం అనగా 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి రూ.4,034 కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టులకు తీయడం విడ్డూరంగా ఉందని సిపిఐ పార్టీ అనుబంధ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షుడు వి.సీతారామయ్య అన్నారు. ఈ నిర్ణయంపై గుర్తింపు కార్మిక సంఘంగా తీవ్ర నిరసన తెలుపుతున్నామన్నారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం తీసిన రెండు వేల కోట్ల రుపాయలను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు.
సింగరేణిలో ముఖ్యమైన సమస్యలు కార్పొరేట్ మెడికల్ బోర్డు సమస్య, సొంత ఇంటి పథకం అమలు, నూతన ప్రాజెక్టులను తీసుకోవడం, మారుపేర్ల సమస్య, పెరిక్స్ మీద ట్యాక్స్ చెల్లించడం మొదలగు సమస్యల మీద ముఖ్యమంత్రితో మాట్లాడటం జరిగిందని, ఆ సందర్భంలో సీఎం అన్ని సమస్యలు విని సానుకూలంగా స్పందించారన్నారు. ఈ విషయాలపై ముఖ్యంగా కంపెనీ లాభాల గురించి ఉప ముఖ్యమంత్రి, సంస్థ చైర్మన్ తో సాయంత్రం వెళ్లి మాట్లాడండి అని, తాను వాళ్లకి సూచన చేస్తానని నాయకులతో చెప్పడం జరిగిందన్నారు.
శనివారం సాయంత్రమే ఉప ముఖ్యమంత్రి , చైర్మన్ తో కలిసి ఈ సమస్యలపై మాట్లాడటానికి తాము ప్రయత్నం చేసినా యూనియన్ నాయకులను తప్పుదోవ పట్టించి శని, ఆదివారం చర్చలు జరపకుండా సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకపక్షంగా కంపెనీకి వచ్చిన లాభాల్లోంచి రూ.4 వేల కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం కేటాయిస్తున్నామని, కేవలం రూ.2,360 కోట్లు మాత్రమే గత ఆర్థిక సంవత్సరానికి లాభాలు వచ్చిందని ప్రకటించడం అందులో 34 శాతం వాటాన్ని ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిరియాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కె.సారయ్య, కె.వీరభద్రయ్య, వైవి రావు, మడ్డి ఎల్లయ్య, కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్.ప్రకాశ్, కేంద్ర కార్యదర్శులు అక్బర్ అలీ, వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శులు ఎస్కే.బాజీ సైదా, సలేంద్ర, సత్యనారాయణ, దాగం మల్లేష్, ఎస్.తిరుపతి, జిగురు రవీందర్, వై.రాంగోపాల్, రమణారావు, డిటి రావు, నాయకులు కొట్టే కిషన్ రావు, మోత్కూరి కొమరయ్య, సుదర్శన్, క్రాంతి, రాంనర్సయ్య, రంగు శ్రీనివాస్, కాంటాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుర్ర తిరుపతి, బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ పాల్గొన్నారు.