కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 22 : సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను కార్మికులు సాధిస్తుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సంస్థ లాభాల బాటలోనే నడుస్తుంది. ఇంత కష్టపడి పనిచేసిన కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు సింగరేణి ప్రధాని ఆస్పత్రిలో కనీస వసతులు కరువయ్యాయి. సోమవారం ఉదయం ఓ మహిళ ఆయాస పడుతూ నడవలేని స్థితిలో ఆస్పత్రికి చేరుకుంది. కానీ క్యాజువాలిటీ వద్ద అందుబాటులో ఉండాల్సిన వార్డ్ బాయ్ లేకపోవడంతో తన తల్లి పడుకున్న కష్టాన్ని చూడలేక చిన్నారి ప్రయాస పడుతూ తనే వీల్ చైర్ సాయంతో లోపలికి తీసుకెళ్లింది. క్యాజువాలిటీ వార్డ్ వద్ద వార్డ్ బాయ్‌లను అందుబాటులో ఉంచడం వల్ల ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు, వారిని అంబులెన్స్ నుంచి దింపి వార్డుకు తీసుకుపోయేందుకు సులువు అవుతుంది.
కానీ ప్రధాన ఆస్పత్రిలో పర్యవేక్షణ కొరవడడంతో నర్సులు, వార్డ్ బాయ్‌లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. క్యాజువాలిటీ వార్డులో ఏసీలు పనిచేయవు, ఏసీ స్విచ్ బోర్డు కూడా పగిలిపోయి స్విచ్ వేయడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి క్యాజువాలిటీ వార్డులో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.