ఇల్లెందు, సెప్టెంబర్ 22 : ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు సీఐటీయూ నాయకులు, హాస్టల్ వర్కర్ల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ 11వ రోజు నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులంతా కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. అక్కడ నుండి ఐటీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా హాస్టల్ వర్కర్స్ నాయకులు, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలో ఉన్న హాస్టల్లో డైలీ వేజ్ వర్కర్లుగా పనిచేస్తూ ప్రతి నెల రూ.26 వేల వేతనాలు పొందిన వారికి ప్రస్తుత ప్రభుత్వం ఆ వేతనాలు తగ్గించి రూ.11 వేల వేతనం ఇస్తానని జీఓ రిలీజ్ చేయడంతో గత 11 రోజులుగా ఆశ్రమ పాఠశాల హాస్టల్ ముందు కార్మికులు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అబ్దుల్ నబి, కృష్ణయ్య, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ల నాయకులు నరసింహారావు, వెంకటేశ్వర్లు, హాస్టల్ వర్కర్లు పాల్గొన్నారు.