Inderjit Singh : ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) ఇంద్రజీత్ సింగ్ గోసల్ (Inderjit Singh Gosal) కెనడా (Canada) దేశంలో అరెస్టయ్యాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గుర్పత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) కు ఇంద్రజీత్ సింగ్ సన్నిహితుడు. 2023 నుంచి గోసల్ కెనడాలో ఎస్ఎఫ్జే కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.
అక్రమంగా ఆయుధాలు కలిగిఉండటం సహా పలు అభియోగాలపై గోసల్ను అట్టావాలో అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. గత ఏడాది నవంబర్లోనూ కెనడా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందని ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో బయటికి వచ్చాడు.
ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు భారత్ కెనడాల మధ్య అంగీకారం కుదిరిందని ఇటీవల భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ అంగీకారంలో భాగంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2023లో ఒక సిక్కు వేర్పాటువాది హత్య అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాలు సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నంలో ఉన్నాయి.
అందుకే భారత్, కెనడాలు ఉపసంహరించుకున్న రాయబారులను ఇటీవల తిరిగి నియమించుకున్నాయి. అనంతరం సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా దేశ రక్షణ సలహాదారు అజిత్ దోవల్, కెనడా భద్రతా సలహాదారు నటాలీ డ్రౌయిన్ల మధ్య చర్చలు జరిగాయి. జూన్లో కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల సంబంధాలపై అక్కడి ప్రధాని మార్క్ కార్నీతో చర్చలు జరిపారు.