హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.4,200 కోట్లు పొందేందుకు ప్రతిపాదనలు పంపింది. రేవంత్‌రెడ్డి సర్కా రు సమర్పించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికకు కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ శాఖకు చెందిన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కమిటీ ఆమోదం తెలిపింది. ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాలశాఖకు సిఫారసు చేసినట్టు కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోఖన్సాహూ చెప్పారు.
లోక్‌సభలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మూసీలో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, స్టార్మ్‌వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రజారోగ్య, పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థకు సమర్పించి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. తర్వాతే రుణ ఒప్పందం ఖరారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.