యువ నటుడు శ్రీనందు లీడ్‌రోల్ చేస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ్’. యామినీ భాస్కర్ కథానాయిక. వరుణ్‌రెడ్డి దర్శకుడు. శ్రీనందు, శ్యామ్ సుందర్‌రెడ్డి తుడి కలిసి నిర్మిస్తున్నారు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘ధుమ్ ఠకుమ్..’ అంటూ సాగే ఈ పాటను అగ్రనిర్మాత డి.సురేశ్‌బాబు ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
హీరో శ్రీనందు మాట్లాడుతూ ‘ఈ పాట సాహిత్యానికి, నా జీవితానికీ చాలా దగ్గర పోలికలున్నాయి. కాసర్ల శ్యామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమా విషయంలో అగ్రనిర్మాత డి.సురేశ్‌బాబు ఇచ్చిన సలహాలు సినిమాకెంతో ఉపయోగపడ్డాయి. సురేశ్‌బాబుతో పనిచేయాలనేది నా 19ఏండ్ల కల. అది ఈ సినిమాతో నెరవేరింది’ అని సంతోషం వెలిబుచ్చారు. సినిమాలో భాగం అవ్వడం పట్ల కథానాయిక యామిని భాస్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా సంగీత దర్శకుడు స్మరణ్ సాయి కూడా మాట్లాడారు. స్పిరిట్ మీడియా పతాకంపై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.