మానకొండూర్ రూరల్, డిసెంబర్ 5 : ‘సర్కారు ఆదాయం కోసం మేం చావాలా..? ఇసుక లారీలతో దుమ్ము ధూళి లేచి రోగాలపాలవుతున్నా పట్టించుకోరా..?’ అంటూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం గ్రామ మహిళలు రోడ్డెక్కారు. వారం క్రితం ఓ సారి ధర్నా చేసినా చర్యలు లేకపోవడంతో శుక్రవారం మరోసారి అన్నారంలో ప్రధాన రహదారి (కరీంనగర్ టూ జమ్మికుంట)పై బైఠాయించి ఇసుక లారీలను అడ్డుకున్నారు.
నిత్యం ఇసుక లారీలతో గోస పడుతున్నామని, అతివేగంగా, ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దుమ్ము ధూళితో అనారోగ్యం పాలవుతున్నామని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వారం క్రితం ధర్నా చేసినా ఎవరూ స్పందించడంలేదని చెప్పారు. అరగంటపాటు ఆందోళన చేయడంతో రోడ్డుకు రెండువైపులా వాహనాలు బారులు తీరాయి.