హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దండకారణ్యం స్పెషల్ జోన్ నుంచి ‘వికల్ప్’ పేరుతో మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. అడవి నుంచి బయటికి వచ్చిన కోసాల్ అనే సభ్యుడే హిడ్మా హత్యకు ప్రధాన కారణమని ఆ లేఖలో పేర్కొన్నది. కోసాల్ నవంబర్లో తెలంగాణ పోలీసుల ఎదట లొంగిపోయాడని, అతను ఇచ్చిన సమాచారమే హిడ్మాను పట్టుకోవడంలో కీలకమైందని తెలిపింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి తమ వద్దే ఉన్నట్టు వెల్లడించింది. వారు మావోయిస్టు పార్టీలోనే ఉంటారని, పోలీసులకు లొంగిపోరని స్పష్టం చేసింది. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ పోలీసులకు ఇచ్చాడన్న వార్త పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నది. హిడ్మా ఎన్కౌంటర్కు దేవ్జీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీశ్ కుంజా ఆరోపించడం ప్రభుత్వ కుట్రేనని తెలిపింది.
ఈ కుట్ర గురించి తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఇంటెలిజెన్స్కు పూర్తి సమాచారం ఉన్నదని ఆరోపించింది. కోసాల్తోపాటు విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు సూత్రధారులుగా భావిస్తున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లిన సమాచారం కోసాల్ ద్వారా లీకైందని, దీంతో పోలీసులు 13 మందిని పట్టుకుని హత్యచేశారని పేర్కొన్నది. మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్ కట్టుకథ అని ఆరోపించింది.