‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ నెల 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం దర్శకుడు శ్రీనివాస్ మన్నె విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
హారర్‌తో పాటు చావు పుట్టుకలనే అంశాలను, దైవత్వం, సృష్టి చేసే పనులను ఈ కథలో చర్చించామని చెప్పారు. మంచి కంటెంట్‌తో పాటు సాంకేతికంగా కూడా ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. ‘ఈ సినిమాలో షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాంటెడ్‌గా భయపెట్టించాలనే ప్రయత్నం చేయలేదు. కథా ప్రయాణం అలా సాగుతుంది. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమా చూడకూడదు.
ఈ సినిమాలో స్నేహం, మానవ భావోద్వేగాలను తాత్విక కోణంలో తెలియజెప్పే ప్రయత్నం చేశాం. మూఢనమ్మకాలు, ఆత్మలు అనే అంశాలను కూడా చర్చించాం. మనకు జరగనంత వరకు ఏదైనా మూఢ నమ్మకమే. జరిగితే నమ్మకంగా మారుతుందనే విషయాన్ని కూడా చూపిస్తున్నాం. ఆత్మ అనేది లేకపోతే ఆ పదమే పుట్టదు కదా? మంచిచెడులు ఉన్నట్లే అది కూడా ఉంటుంది. నేను అన్నీ జోనర్స్లో సినిమాలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి’ అని శ్రీనివాస్ మన్నె పేర్కొన్నారు.