భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 5 : జీవనోపాధికోసం ఆఫిక్రా దేశంలోని మాలికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కిడ్నాప్‌నకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాసు జంగయ్యగౌడ్ కుమారుడు నల్లమాసు ప్రవీణ్ హైదరాబాద్‌లో ఓ బోర్వెల్ కంపెనీలో పనిచేసేవాడు.
ఈ క్రమంలో గత సంవత్సరం నవంబర్‌లో ఆఫ్రికా దేశంలోని మాలికి జీవనోపాధికోసం వెళ్లాడు. కోబ్రీలో రోజువారీగా పనిచేస్తున్నాడు. గత నెల నవంబర్ 23న పని ముగించుకుని తిరిగి వస్తుండగా జమాత్ నుస్రత్ ఆల్ ఇస్లాం ముస్లీమీన్ (జేఎన్ఐఎం) సంస్థకు చెందిన తీవ్రవాదులు ప్రవీణ్‌ను కిడ్నాప్ చేశారు. ఫోన్‌ను స్వాధీనం చేసుకుని స్విచ్చాఫ్ చేశారు.
ప్రవీణ్ అదేరోజు తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో బోర్వెల్ ప్రతినిధులు సంప్రదించారు. బోర్వెల్ ప్రతినిధులు మాలిలో తమ ప్రతినిధులను సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా మాలిలో కిడ్నాపైన తన కొడుకును స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ తండ్రి జంగయ్యగౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.