గురువారం విడుదల కావాల్సిన ‘అఖండ 2’ వాయిదా పడటం దురదృష్టకరమని అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు. శుక్రవారం జరిగిన ‘సైక్ సిద్థార్థ్’ సినిమా ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన ‘అఖండ-2’ సినిమా వాయిదా తాలూకు వివాదం గురించి స్పందించారు. ‘ఈ సినిమా వివాద పరిష్కారానికి నేనూ వెళ్లాను. అవన్నీ ఆర్థికపరమైన ఇబ్బందులు. వాటిని బయటకు వెల్లడించకూడదు. అయితే.. విషయం తెలియకుండా ఎవరికి తోచినట్టు వాళ్లు రాస్తున్నారు. లేని కారణాలను ఉన్నట్టు చెబుతున్నారు. ‘ఇన్ని కోట్లు.. అన్ని కోట్లు’ అని రాస్తున్నారు. ఇది భావ్యం కాదు. అవేమీ నిజాలు కావు. ఇలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు గతంలోనూ చాలా వచ్చాయి.
‘అఖండ 2’ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. త్వరలోనే సినిమా కూడా విడుదలవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘అఖండ-2’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14రీల్స్ ప్లస్ శుక్రవారం ఉదయం ఓ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా అభిమానులకు క్షమాపణలు చెప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’కు పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.