కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 10 : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కుటిల బుద్ధిని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఆడ లేక మద్దెల ఓడినట్టు అనే సామెత చందంగా ఉందని మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును నిరసిస్తూ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి మాట్లాడారు. ఎవరూ అడగక ముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని ఆశ పెట్టి అది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా కుదిరే పరిస్థితి లేకపోయేసరికి తాము బీసీలకు రిజర్వేషన్ 42 శాతం ఇస్తున్నాం గాని, హైకోర్టు, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని దొంగ నాటకాలు ఆడుతున్నట్లు మండిపడ్డారు.
అలవి గాని హామీలు ఇచ్చి గద్దనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా, కులాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న మాలలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. కనీసం మాదిగలైనా కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఉంటారనుకుంటే మందకృష్ణ మాదిగ మాదిగలదరిని బిజెపికి సపోర్ట్ చేయమని డప్పు పట్టుకుని చాటింపు వేస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి కులం చెడ్డా సుఖం దక్కలేదన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎస్టీలలోకెళ్లి లంబాడ సామాజిక వర్గాన్ని తీసివేయాలని అటు లంబాడ, కోయల మధ్య చిచ్చు పెట్టిందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ఉన్నఫలంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని భయంతో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనే నాటకాన్ని ముందుకు తీసుకువచ్చి డ్రామాలాడుతూ ఎన్నికలు వాయిదా వేయించుకోవాలనే కుట్రలో భాగంగా బీసీలను పావులుగా వాడుకుంటున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దళిత, గిరిజన, బహుజన వాదులందరూ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెల రామనాథం, తాండ్ర వెంకటేశ్వర్లు, అంకినీటి ప్రసాద్, ఎం.భిక్షపతి, జి.నాగయ్య, రామాచారి, లక్ష్మణ్, సర్వేష్, తమ్మిశెట్టి నాగేంద్రబాబు, పీఎన్ మూర్తి, ద్విపాద సత్యనారాయణ, దళిత, గిరిజన, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.