ఖమ్మం, అక్టోబర్ 9: నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ, అభివృద్ధి పనులపై మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేస్తున్న పనులను ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, పనులలో లోపం కనిపిస్తే ఉపేక్షించొద్దన్నారు.
ప్రకాశ్ నగర్, గాంధీనగర్, ద్వారకానగర్, చర్చి కాంపౌండ్ రోడ్, శ్రీనివాస నగర్ ప్రాంతాల్లో చేపట్టిన పనులు పూర్తికాగా, ఎన్ఎస్పీ క్యాంపు, కొత్త బస్టాండ్, తెలంగాణ తల్లి కూడలి ప్రాంతాల్లో కొనసాగుతున్న పనుల ఫొటోలను కలెక్టర్ పరిశీలించారు. ఖమ్మం నగరం అందంగా ఉంటేనే జిల్లా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. సెంటర్ డివైడర్లు, సరిళ్లకు రంగులు వేయాలని, ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు పెట్టాలని సూచించారు. నూతన టెక్నాలజీతో నగరంలో గుంతలు పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.