Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 329 పాయింట్లకుపైగా పెరిగింది. ఫార్మా, బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడంతో పాటు విదేశీ పెట్టుబడులతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. 82,075.45 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు కొద్దిసేపటికే కోలుకున్నాయి. ఇంట్రాడేలో 82,072.93 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 82,654.11 పాయింట్లకు పెరిగింది. చివరకు 328.72 పాయింట్ల నష్టంతో.. 82,500.82 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 103.55 పాయింట్లు లాభపడి.. 25,285.35 వద్ద స్థిరపడింది. శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పెరిగి 88.69 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, సన్ ఫార్మాస్యూటికల్స్, పవర్ గ్రిడ్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి.
బ్యాంకింగ్, ఫార్మా స్టాక్ మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్, టోక్యో నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ నష్టాల్లో ముగిశాయి. సియోల్ కోస్పి లాభాల్లో ముగిసింది. యూరోపియన్ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా కొనసాగాయి. గురువారం నమోదైన రికార్డు గరిష్టాల నుంచి స్వల్పంగా తగ్గాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.63 శాతం తగ్గి 64.81 డాలర్లకు చేరుకుంది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) గురువారం రూ.1,308.16 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.