Gaza Ceasefire | రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్ గురువారం సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Gaza Ceasefire) అమల్లోకి వచ్చింది.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (Israeli military) శుక్రవారం ప్రకటించాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో గాజాలో యుద్ధం ముగిసిందంటూ వెల్లడించాయి. గాజా (Gaza) నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇరు పక్షాలు బందీలను విడుదల చేసేందుకు సన్నాహకాలు ప్రారంభించాయి.
రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్ అనూహ్య దాడితో యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడికి దిగింది. దాదాపు 1,200 మందిని హతమార్చి, 250 మందికిపైగా బందీలుగా చేసుకుంది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 67,000 మందికిపైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకుని జీవిస్తున్నారు. వేలాదిమంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. ఈ మేరకు గాజాలో శాంతికి 20 సూత్రాల శాంతి ప్రణాళికను సూచించారు. ఇందుకు ఇజ్రాయెల్-హమాస్ అంగీకరించడంతో యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది.
Also Read..
గాజాలో శాంతి వీచికలు.. కాల్పుల విరమణ, బందీల అప్పగింతపై ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం
Nobel Prize | ‘నోబెల్’ గ్రహీతలకు ఎంత ప్రైజ్‌మనీ వస్తుందో తెలుసా.. ఆసక్తికర విశేషాలు మీకోసం..