నేరేడుచర్ల, అక్టోబర్ 10 : ప్రజాస్వామ్య దేశంలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించేందుకు ప్రతి పౌరుడు తనకు కావాల్సిన సమాచారాన్ని స్వేచ్ఛగా పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని డీఐఈఓ భాను నాయక్ అన్నారు. సమాచార హక్కుచట్టం -2005 వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అలాగే తమ వంతుగా చట్టంపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మనకు అవసరమైన ఎలాంటి సమాచారం అయినా ఒక దరఖాస్తు ద్వారా సులభంగా పొందవచ్చు అన్నారు. సమాచార హక్కు చట్టం ఒక ఆయుధం లాంటిదని, ఆయుధానికి పదును పెడితే ఏదైనా సాధించవచ్చు అన్నారు.
ముఖ్యంగా యువత సమాచార హక్కు చట్టంపై ఎక్కువ దృష్టి పెట్టి వినియోగించుకోవాలన్నారు. విద్యార్థి దశ నుండే అన్ని చట్టాల గురించి అవగాహన పొందాలన్నారు. అలాగే విద్యార్థులు కూడా పరీక్షలు సమీపిస్తున్నందున కష్టపడి చదవాలన్నారు. ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఎఫ్ ఆర్ ఎస్ పద్ధతిని అమలు చేస్తున్నామని, దీంతో గైర్హాజరైన విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని హెచ్చరించారు. ప్రభుత్వ కళాశాలలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. మంచి ఫలితాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ, అధ్యాపకులు డాక్టర్ మద్దిమడుగు సైదులు, ప్రణతి, నరసింహారావు, శ్రీనివాసులు, నరసింహ చారి, నరేందర్, గణేష్, ప్రసాద్, సునీత, అంజయ్య, వీరు, వెన్నెల, లైబ్రేరీయన్ జానకిరామ్ రెడ్డి, ఆఫీసు స్టాఫ్ బి.అన్వేష్, సుశాంత్ కుమార్, దుర్గయ్య, మముదబేగం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.