స్పర్ధ, చర్చ, యుద్ధం ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడే ఒక విషయంలోని మంచి చెడుల గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మహిళల మీద జరుగుతున్న అనేక అరాచకాలను తెరమీదికి తీసుకువస్తూ.. అందులోని మంచి చెడుల విషయంలో ఆలోచనలకు నాంది పలుకుతున్నాయి. తమ దేశంలోని తమ పౌరురాలైన మహిళను కుటుంబ సభ్యులు ఎంత కొట్టినా పర్వాలేదని, కేవలం ఎముకలు విరగకుండా ఉంటే చాలు.. అది శిక్షార్హమైన నేరం కాదని చెప్పే చట్టాలు చేసుకున్న దేశాలు నేటి రోజున కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు! అయితే ఖండం, దేశం, ప్రాంతం వేరైనా వివిధ రకాల వివక్షలను తరాల నుంచి ఎదుర్కొన్న మహిళ తనను తాను సర్వసన్నద్ధం చేసుకోవడం ద్వారా బలవంతు రాలుగా నిరూపించుకోవచ్చు. తనమీద తరచూ జరిగే యుద్ధాన్ని ఎదిరించి నిలబడొచ్చు. విద్య, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం లాంటి సుగుణాలన్నీ ఆమెకి ఇందులో అండగా నిలిచేవే!! ఊరించే కలల నుంచి ఉన్నత శిఖరాలకు చేర్చేవే!
ప్రగతి ఒక్కరోజులో రాదు. మార్పు కూడా అంతే! వీటిని సాధించడానికి బలమైన విలువలు, నిరంతర కృషి అవసరం. తనను తాను పటిష్ఠమైనదిగా నిలబెట్టుకోవడానికి ఒక దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఎలా పనిచేస్తుందో, వ్యక్తిగా ఆమె కూడా తనకు తాను మెరుగుపరచుకోవాల్సిన వివిధ అంశాల మీద దృష్టి పెడితే అదే అతివకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.
ఆత్మవిశ్వాసం పునాది
విజయానికి తొలి మెట్టు ఆత్మవిశ్వాసం. ఇది లేకపోతే ఉన్న ప్రతిభ కూడా వెలుగులోకి రాదు. అందుకే ఆమె తన సామర్థ్యాన్ని తాను నమ్మిన క్షణమే గెలుపు తలుపు తెరుచుకుంటుంది అని తెలుసుకోవాలి. వీరవనితల గాథలు చదవడం, విధిని ఎదిరించి గెలిచిన వారి కథలు తెలుసుకోవడం మనకు మనపై నమ్మకాన్ని కలిగిస్తాయి. అప్పుడే ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది.
చదువులో నిబద్ధత
విద్య ఏ వ్యక్తికైనా శక్తిమంతమైన ఆయుధం. అది మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. మన జీవితంలో ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవడానికి అయినా ఆ విషయం పట్ల అవగాహన ఉండడం చాలా ప్రధానం. అలాంటప్పుడు మనకు సరైన దిశలో మార్గనిర్దేశనం చేసేందుకు విద్య ఎంతగానో తోడ్పడుతుంది. ఆర్థికంగా, సామాజికంగా చదువు మనిషిని బలపరుస్తుంది. ఎముకలు విరగకపోతే చాలు ఆడపిల్లను ఎంతైనా కొట్టొచ్చు అని చట్టం చేసిన వ్యక్తి అయినా సరే, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే డాక్టరమ్మకు దండం పెట్టకుండా ఉండలేడు! ఆమె సాయాన్ని పొందకుండా బతకలేడు. విద్యావంతులను, మేధోవంతులను ఏ దేశమైనా తమ ఆస్తిగా పరిగణించక తప్పని పరిస్థితి. సాధారణ కుటుంబాల నుంచి వచ్చినా విద్యా దీపం తోడుగా దేశ అత్యున్నత పదవుల్ని అలంకరిస్తున్న మహిళలను మనం ఇప్పుడు చూస్తున్నాం. అందుకే చదువును ఆడపిల్ల చిరకాల ఆభరణంగా అలంకరించుకోవాలి. తన గౌరవ చిహ్నంగా భావించాలి.
క్రమశిక్షణ బ్రహ్మాస్త్రం
నిలకడైన ఎదుగుదల రహస్యం క్రమశిక్షణే. ప్రతిభ ఉన్నా ఇది లేకపోతే ఏ విషయంలోనూ వృద్ధిని సాధించలేం. సమయపాలన, నిబద్ధత, క్రమబద్ధమైన కృషి, చక్కటి రోజువారీ అలవాట్లు… విజయాన్ని చేరువ చేస్తాయి. నిరంతర సాధనతో ప్రపంచస్థాయి పతకాలను సాధిస్తున్న అతివల్ని చూస్తూనే ఉన్నాం. అంతరిక్షాన్ని అందుకున్న ఆడవాళ్లకూ ఆకాశమంత బలాన్ని ఇచ్చింది క్రమశిక్షణే అని మర్చిపోకూడదు.
ఆర్థిక స్వావలంబన దిశలో
స్వేచ్ఛకు పునాది ఇది. నచ్చినట్టు అని మాత్రమే కాదు కనీసం బతకాలన్నా డబ్బు ఎంతో అవసరం. అది వచ్చే మార్గాన్ని ఏ వ్యక్తి అయినా తప్పక గౌరవించాల్సిందే. బాధ్యతలను పంచుకుంటూ, తన కాళ్ల మీద తను నిలబడే ప్రతి స్త్రీకి గౌరవం తప్పక లభిస్తుంది. ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడు మహిళ కూడా కుటుంబానికి, సమాజానికి బలమే తప్ప బలహీనత కాబోదు. అందుకే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏం చేసినా బతుకు తెరువు మీద ఆడపిల్ల కూడా తప్పక దృష్టి పెట్టాలి. సంపాదనను పొదుపు, మదుపు చేసే మార్గాలు తెలుసుకోవాలి. ఆర్థిక స్వావలంబన మహిళలకు బలమైన నిర్ణయాలు తీసుకొనే ధైర్యాన్ని ఇస్తుంది.
సానుకూల మార్గంలో
సమస్యల్ని అవకాశాలుగా మార్చే శక్తి ఇది. సానుకూల దృక్పథం ఉన్న మహిళ ఓటమిని కూడా పాఠంగా మార్చుకుంటుంది. ప్రతి అడ్డంకినీ విజయ సోపానంగా మలచుకుంటుంది. నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సమస్యను పరిష్కారం దిశగా నడిపించే ఈ మనస్తత్వం నలుగురిని నీ వైపు తిప్పుకొంటుంది. అది ఇల్లయినా, కార్యాలయం అయినా!
సాంకేతికత తోడుగా
డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాథమిక అవసరంగా మారిపోయింది. స్మార్ట్ఫోన్ వాడకం మొదలు నిత్యావసరాల కొనుగోలు, ప్రయాణాలు, ఉద్యోగాలు… ఇలా అన్నిటిలోనూ సాంకేతికత వినియోగం ఒక అత్యవసరం అయింది. దీని ద్వారా పనులను సులభతరం చేసుకుంటూ ఉత్పాదకతను పెంచుకునే అవకాశాలు మెరుగుపడ్డాయి. గ్రామీణ ప్రాంత మహిళలు కూడా ఇంటర్నెట్ సదుపాయం ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారు. కాలానికి తగ్గట్టుగా మనల్ని మనం మలచుకునేందుకు ఆధునిక సాంకేతికత ఒక మంచి మార్గం.
సహనశక్తి అండగా
సహనం బలమైన మనస్తత్వ లక్షణం. జీవితంలో ఎన్ని సవాళ్లు వచ్చినా నిలబడే శక్తిని ఇస్తుంది ఇది. పరాజయాన్ని ఓటమిగా కాకుండా అనుభవంగా చూడాలి. ఏ పని చేస్తున్నా ఎలాంటి పదవిలో ఉన్నా స్త్రీ సహజమైన సహనం, ప్రేమ అనేవి గుంపు నుంచి మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. కేవలం అమ్మ ప్రేమను పొందడం కోసమే మహావిష్ణువు అంతటివాడు శ్రీకృష్ణుడిగా మానవ అవతారం ఎత్తాడు.
అవమానాన్ని, సవాళ్లను ఎదుర్కొనడానికి సహనాన్ని మించిన అస్త్రం మరొకటి ఉండదు. తరాల నుంచి వస్తున్న వివక్షను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా మహిళా లోకం చేసిన ఎన్నో పోరాటాల ప్రధాన బలం కూడా ఇదే. ఆ ఫలాలు రోజురోజుకీ మరింత రుచిగా మారేవే! మహిళలకు తక్కువ ప్రాధాన్యం ఉన్న ఉన్నత పదవులు, రాజకీయాల లాంటి రంగాల్లోనూ రాణించేందుకు సహన శక్తి సహకరిస్తుంది. అప్పుడు స్త్రీలకు సమాన హక్కులు ఇచ్చే మరిన్ని చట్టాలను ఇంకా పటిష్టంగా చేసుకునే అవకాశం మహిళా లోకానికి దక్కుతుంది.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి