న్యూఢిల్లీ, మార్చి 7: ‘రండి.. గాడిదలు పెంచండి… లక్షాధికారులు కండి’ అంటూ రైతులు, వ్యాపారం చేసే ఉత్సాహవంతులు, సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది. గాడిదలే కాదు.. మీకు ఆసక్తి ఉంటే గుర్రాలు, ఒంటెలను కూడా పెంచవచ్చునని అంటున్నది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం) కింద భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ గాడిదల పెంపకంతో పాటు పశువుల వ్యాపారాన్ని పెంచడానికి వ్యవస్థాపకులు, రైతులను ప్రోత్సహిస్తున్నది.
ఈ పథకం కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెలు వంటి బ్రీడింగ్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికి వ్యక్తులు, రైతు గ్రూపులు, స్వయం సహాయ సంఘాలు, సహకార సంస్థలకు రూ.50 లక్షల వరకు రాయితీతో కూడిన రుణాన్ని ఇస్తారు. గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు ఇచ్చే ఈ రుణంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుందని కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో తెలిపింది. ఒక గాడిద పెంపక కేంద్రంలో 50 ఆడ, ఐదు మగ గాడిదలు తప్పనిసరిగా ఉండాలి. ఇందులో దేశీయ రకాలనే పెంచాలి.