రోజులు గడిచే కొద్దీ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముచ్చటను ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు. బతుకమ్మ ఆడిన తర్వాత ముద్దపప్పు, బెల్లం ఆప్యాయంగా ఇచ్చిపుచ్చుకుంటారు. తెలంగాణ ప్రాంతంలోనూ పెసరపప్పునకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అన్నప్రాశన మొదలు పిల్లలకు పెసరపప్పు, బియ్యంతో కలిపి ఉగ్గు వండి నెయ్యితో కలిపి పెడతారు తల్లులు. ముద్దపప్పు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.
అమ్మను ‘ముద్గౌదనాసక్త చిత్తా’ అంటారు. అంటే అమ్మవారికి కూడా పెసరపప్పుతో చేసే పొంగలి, ఇతర వంటకాలంటే ప్రీతి అని చెబుతారు. బతుకమ్మ మూడోనాడు ముద్దపప్పులో బెల్లం వేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించి.. పిల్లలకు ప్రసాదంగా పంచిపెడతారు.
– డా॥ఆర్.కమల