శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని శ్రీగాయత్రీదేవిగా అలంకరించి ఆరాధిస్తారు. ‘నగాయత్య్రాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్’- గాయత్రిని మించిన మంత్రం లేదు, ఆ తల్లిని మించిన దైవం లేదు అని శాస్ర్తాలు చెబుతున్నాయి.
మాతా చతుర్ణాం వర్ణానాం వేదాంగానాం చ ఛందసాం
సంధ్యావందన మంత్రాణాం తంద్రాణాం చ విచక్షణా॥
నారాయణుడు గాయత్రీదేవి వైభవాన్ని నారదుడికి చెప్పిన సందర్భంలో పేర్కొన్న మంత్రం ఇది. గాయత్రి సర్వజగజ్జనని అని విశదీకరించాడు నారాయణుడు. అంతేకాదు, గాయత్రి సమస్త వేదవేదాంగాలకూ అధిదేవత. ఆమె జ్ఞానదాయిని. స్కాంద పురాణం ప్రకారం గాయత్రీదేవికి మరోపేరే సరస్వతి. అయిదు ముఖాలుగా అభివర్ణించే గాయత్రీమాతను పద్మాసినిగా కొలవటం ఆనవాయితీ. అమ్మవారి పంచముఖాలను ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలకు ప్రతీకలుగా భావిస్తారు. అలాగే పంచభూతాలైన భూమి, జలం, అగ్ని, గాలి, ఆకాశాలను కూడా అమ్మవారి అయిదు ముఖాలుగా భావించి ఆరాధిస్తారు. అదేవిధంగా గాయత్రీమాత పది హస్తాలతో విరాజిల్లుతుంది. పది చేతుల్లో అమ్మవారు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆయుధాలను ధరిస్తుంది. వరద, అభయ హస్తాలతో భక్తులను కరుణిస్తుంది. గాయత్రీదేవి మహాశివుడిలా మూడు నేత్రాలతో దర్శనమిస్తుంది.
‘సకల దేవతల శక్తిసంపత్తులు నిబిడీకృతం చేసుకున్న ఏకైక మంత్రం ‘గాయత్రీ మంత్రం’ అందుకే అన్ని మంత్రాలు గాయత్రీ మంత్రంలో లయమవుతాయి’ అన్నారు రామకృష్ణ పరమహంస. శ్రీకృష్ణ భగవానుడు కూడా గాయత్రీ మంత్ర విశిష్టతను తెలియజేశాడు. భగవద్గీతలోని ‘విభూతి యోగం’లో ‘గాయత్రీ ఛందసా మహమ్’ అంటూ వైదిక మంత్రాల్లో గాయత్రీ మంత్రాన్ని నేనే! అని పునరుద్ఘాటించాడు.
గాయత్రీ మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. ఈ మంత్రం ప్రాణశక్తిని కాపాడుతుందని ఉపాసకుల ప్రగాఢ విశ్వాసం. వాల్మీకి మహర్షి రామాయణ కావ్యంలో ప్రతి వెయ్యి శ్లోకాలకు ఒక శ్లోకాన్ని గాయత్రీ మంత్రంలోని ఒక్కో మంత్రాక్షరంతో ప్రారంభించారు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలను పొందుపరుస్తూ 24వేల శ్లోకాలతో ఆదికావ్యాన్ని జాతికి అందించారు. గాయత్రీ మంత్రాక్షరాలు పొందుపరచిన 24 శ్లోకాలు గాయత్రీ రామాయణంగా ప్రసిద్ధి. దీనిని చదివితే సంపూర్ణ రామాయణం పారాయణం చేసిన ఫలం కలుగుతుందని విశ్వసిస్తారు.
– మనోజ్ఞ