విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ముఖ్యంగా బి12 లోపం వల్ల మహిళల్లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నిజానికి ఇది మహిళల ఆరోగ్యానికి ఒక పవర్ హౌజ్ పోషకంలాంటిది. మెదడు పనితీరు, హార్మోన్ల సమతుల్యత, గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. కానీ, విటమిన్ బి12 లోపిస్తే కలిగే రుగ్మతలు కూడా ఎక్కువే!
లోపిస్తే..: శరీరంలో విటమిన్ బి12 లోపించినప్పుడు.. అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, చర్మం పసుపు రంగులోకి రావడం, నోటిలో పుండ్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కంటిచూపు మందగించడం, నెలసరి సమస్యలు, మానసిక ఆందోళన, అరచేతులు, అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలాగే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.
ఏం తినాలి?: సహజ పద్ధతిలో విటమిన్ బి12 పొందాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, పండ్లు, బీట్రూట్, పుట్టగొడుగులు, కోడి మాంసం, మేక మాంసం, చేపలు తీసుకోవడం వల్ల తగినంత బి12 లభిస్తుంది. సమస్య తీవ్రతనుబట్టి వైద్యుల పర్యవేక్షణలో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకోవచ్చు.