దామరగిద్ద, సెప్టెంబర్ 22 : మొన్నటి దాకా యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగగా.. నేడు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి. నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఏసీసీఎస్కు పల్లీ విత్తనాలు వచ్చాయని తెలుసుకొన్న 200 మంది రైతులు సోమవారం పెద్ద ఎత్తున చేరుకున్నారు. తెల్లవారుజాము 5:30 గంటల నుంచే పడిగాపులు కాయడంతో కార్యాలయ సిబ్బంది ఉదయం 8 గంటల తర్వాత వచ్చి వేరుశనగ విత్తనాలు పంపిణీకి సిద్ధమవగా.. రైతులు ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
దీంతో నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటప్ప కాలు విరిగింది. సిబ్బంది పంపిణీని నిలిపివేయగా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు నారాయణపేట-మద్దూరు రహదారిపైకి చేరుకొని ఆందోళనకు దిగారు. 2 గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వ్యవసాయాధికారి రైతులను పీఎస్‌కు పిలించి ఎస్సై రాజుతో కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పీఏసీసీఎస్ తాళం విరగ్గొట్టి దాదాపు 90 సంచులను కొందరు కర్షకులు ఎత్తుకుపోయినట్లు అగ్రికల్చర్ అధికారి తెలిపారు. ఎస్సై అక్కడకు చేరుకొని రైతులను గేటు బయటే నిలబెట్టి ఒక్కో రైతుకు ఒక బ్యాగ్ చొప్పున పంపిణీ చేయించారు. అయినా తమకు అందలేదని కొందరు నిరాశ వ్యక్తం చేశారు.
హామీలు ఇచ్చి వదిలేస్తుండడంతో పడరాని పాట్లు పడుతున్నామని రైతులు వాపోయారు. పనులు వదులుకొని ఓ రోజు టోకెన్లు అని.. మరో రోజు యూరియా కోసమని గంటల తరబడి క్యూలైన్ల్లో నిల్చున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల యూరియా రాకపోవడంతో పొద్దస్తమానం పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని పీఏసీసీఎస్కు యూరియా వస్తుందని చెప్పడంతో సోమవారం ఆయా గ్రామాల నుంచి రైతులు భారీగా తరలిచ్చారు.
తీరా యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. యూరియా అందించే వరకు ఇక్కడి నుంచి లేచే ప్రసక్తిలేదని రైతులు భీస్మించుకు కూర్చున్నారు. రాస్తా
రోకోతో ఎక్కడికక్కడ భారీగా వాహనాలు నిలిచిపోవడబంతో ఏవో కరుణశ్రీ, ఎస్సై నరేశ్‌కుమార్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన
విరమించారు. యూరియా కోసంగోపాల్పేటలో ఆందోళన
యూరియా కోసం సీఎంకు ఫోన్ చేసుకో అంటుండ్రు గోపా ల్పేట సింగిల్ విండో కార్యాలయానికి వెళ్లి యూరియా కా వాలని అడగగా.. అక్కడి అటెండర్ మాత్రం యూరియా గురించి మాకు తెల్వదు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసుకోమని చెబుతున్నాడని బుద్ధారం గ్రామానికి చెందిన మహిళా రైతు మునగాల కొండమ్మ వాపోయింది. ఈ విషయాన్ని గోపాల్ పేటలో రైతుల ధర్నాలో అధికారుల ముందే చెప్పినా స్పందన లేదన్నది.
ఆ సమయంలో అక్కడే ఉన్న బుద్ధారం పరిధిలోని లక్ష్మీతండాకు చెందిన మరో రైతు నానునాయక్ స్పందించి ‘సీఎం సెల్ నెంబర్ మాకు తెలియదు.. జర ఇయ్యండి సార్’ అంటూ అక్కడే అధికారులను అడిగాడు. కాగా అటెండర్‌ను వివరణ కోరితే యూరియా విషయం తనకు తెల్వదు.. సారోళ్లకే తెలుసని అన్నానని, సీఎంకు ఫోన్ చేయండి
అని చెప్పలేదన్నారు.