బంజారాహిల్స్, సెప్టెంబర్ 22: ‘కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అనేకరకాలుగా నా కొడుకుపై ఒత్తిడి చేశాడని.. వారి వేధింపులు భరించ లేకనే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ బోరబండ డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు, దివంగత మహ్మద్ సర్దార్.. తల్లి ఫాతిమాబాను కన్నీళ్లపర్యంతమయ్యారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన బోరబండ డివిజన్ బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో దివంగత సర్దార్ తల్లి ప్రసంగించారు.
నా కొడుకు సర్దార్ చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తానని, తన ప్రాణం పోయినా సరే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటానని పేర్కొన్నారు. సర్దార్ సతీమణి సమీనా యాస్మిన్ మాట్లాడుతూ.. తన భర్త సర్దార్ మరణానికి కారణమైన కార్పొరేటర్ ఫసీయుద్దీన్కు శిక్ష పడాల్సిందే అని, కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్న మాగంటి సునీతాగోపీనాథ్కు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.