నాగుల పంచమి నాడు ఉయ్యాలో.. నరులొక్కపొద్దు ఉయ్యాలో..
మా ఇంట్ల నాగరాణి ఉయ్యాలో.. దశిమొక్కాపొద్దు ఉయ్యాలో..
ముత్యాల బండెక్కి ఉయ్యాలో.. ముని జలకామాడె ఉయ్యాలో..
పగడాల బండెక్కి ఉయ్యాలో.. పై జలకామాడె ఉయ్యాలో..
కంచిపట్టూ చీర ఉయ్యాలో.. తానుగట్టినాది ఉయ్యాలో..
దొంతుల్ల టొపిరైకె ఉయ్యాలో.. జాడిచ్చి తొడిగే ఉయ్యాలో..
ప్యాలాలు పుట్నాలు ఉయ్యాలో.. వొల్లెవోసూకోని ఉయ్యాలో..
సన్నపురైకలు ఉయ్యాలో.. చక్కనీ కుడుకలు ఉయ్యాలో..
పసుపూ కుంకుమ ఉయ్యాలో.. తావండ్లవెట్టుకొని ఉయ్యాలో..
ఇల్లెల్లె నాగరాణి ఉయ్యాలో.. ఇల్లింత పువ్వోలె ఉయ్యాలో..
బయలెల్లె నాగరాణి ఉయ్యాలో.. బంతీపువ్వోలె ఉయ్యాలో..
దొడ్డెల్లె నాగరాణి ఉయ్యాలో.. దోసాపువ్వోలే ఉయ్యాలో..
ఆడికెల్లి నాగరాణి ఉయ్యాలో.. పుట్టకొచ్చీనాది ఉయ్యాలో..
పుట్టచుట్టూ తిరిగి ఉయ్యాలో.. పూదిచ్చి మొక్కె ఉయ్యాలో..
పుట్టాలున్నా నాగ ఉయ్యాలో.. బుస్సుమనీలేసె ఉయ్యాలో..
నడుము దింపకు నాగ ఉయ్యాలో.. నీ నడిపి చెల్లెల్ని ఉయ్యాలో..
గుడ్లుదియ్యకు నాగ ఉయ్యాలో.. గొడ్డురాల్ను కాను ఉయ్యాలో..
గుంజుకొని పడిగె ఉయ్యాలో.. గుమ్మడీ వనములకు ఉయ్యాలో..
మల్సుకో నీ పడిగె ఉయ్యాలో.. మల్లె వనములకు ఉయ్యాలో..