దామరగిద్ద : నారాయణపేట(Narayanapeta) జిల్లా కొడంగల్-నారాయణపేట ఎత్తి పోతల( Lift Irrigation) పథకంలో భూములు కోల్పోతున్న రైతులు అధికారులపై తిరగబడ్డారు( Farmers Protest) . దీంతో ఉద్రిక్త పరిస్థితులు ( Tensions ) ఏర్పడ్డాయి. తోపులాటలో మహిళా రైతు సొమ్మసిల్లిపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు సర్వే చేయడానికి అధికారులు రావడంతో రైతులంతా ఏకమై అధికారులను అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న పైఅధికారులు వందల మంది పోలీసులను అక్కడికి పంపించడంతో పోలీసులకు ( Police ) వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. బాపనగుట్ట రైతులతో పాటు మహిళ రైతులు కూడా వచ్చి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సమయంలో గ్రామంలో మల్లమ్మ అనే మహిళ రైతు స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భీమప్ప అనే రైతు సర్వే కోసం వచ్చిన అధికారి కాళ్లు మొక్కుతా సార్.. మాకు చాలినంత డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాతనే సర్వే చేయాలని కాళ్లపై పడి వేడుకున్నాడు.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో పది గంటల వరకు కొనసాగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారమే చేస్తున్నామని ఇప్పటికే డబ్బులు వచ్చిన రైతులకు కూడా ప్రభుత్వం పెంచి ఇస్తే అది కూడా మిగతా రైతులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ మోగులప్ప మాట్లాడుతూ రైతుకు సరైన ధర నిర్ణయించిన తరువాతనే సర్వే చేపట్టాలని కోరడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.