వనపర్తి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రైతులకు యూరియా కష్టాలు అధికమయ్యాయి. ఆగస్టు 29న పెద్దమందడి మండలం వెల్టూరులోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అనధికారికంగా 250 బస్తాల యూరియాను నిల్వ చేశారని షాపు యజమానిని అదుపులోకి తీసుకొని షాప్‌ను సీజ్ చేశారు. అయితే, ఓ సొసైటీకి కేటాయించిన యూరియా ఇక్కడ నిల్వ చేశారని, అధిక ధరలకు విక్రయించారని, ఆన్లైన్లో నమోదు చేయలేదని ఇలా అనేక ఆరోపణలు వినిపించాయి. రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే ఇలా అక్కడక్కడా వెలుగు చూస్తున్న ఘటనలు యూరియా పక్కదారి పడుతుందనే సందేహాలకు ఊతమిస్తున్నది. అధికారులు సైతం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో మరిన్ని అనుమానాలకు దారితీస్తున్నది. యూరియా, ఎరువుల నిల్వలు నిల్‌గా ఉన్నాయి.
వచ్చే అరకొర యూరియా కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతున్నది. జిల్లాలోని 15 మండలాల్లో దాదాపు 2లక్షల ఎకరాల వరకు వరి సాగు చేయగా, యూరియా లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పదేండ్లు పుష్కలంగా వరిసాగైనా ఏనాడూ ఎరువుల కొరత రైతులు ఎరుగలేదు. రైతులకు అందాల్సిన సమయంలో అందకపోవడం వల్ల రోజురోజుకు సమస్య తీవ్రమవుతున్నది. వచ్చిన యూరియాను ఎకరాకు ఒక బస్తా చొప్పున ఎన్ని ఎకరాలున్నా 5బస్తాలే అన్న నిబంధనలు రైతులకు శాపంగా మారాయి.
ఈ ఏడాది ఎగువన వర్షాలు అధికంగా రావడంతో జూన్ చివరిలోనే జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అనంతరం వర్షాలు అధికం కావడం, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువు, కుంటలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. దీంతో రైతులు అధికంగా వరి నాట్ల వైపు అడుగులు వేశారు. బీఆర్ఎస్ హయాంలో కేఎల్ఐ, బీమా, నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్ పనులను చేపట్టి కాల్వల ద్వారా సాగునీరందించడంతో గడచిన పదేండ్లలో వరి శిస్తులు పెరిగాయి. అదే క్రమంలో ఈ వానకాలం సైతం అనువైన వర్షాలతో అన్నదాతలు అధికంగా వరిసాగుకు ప్రాధాన్యతనిచ్చారు. ఒక్క వనపర్తి జిల్లాలోనే దాదాపు 2లక్షల ఎకరాల్లో వరి శిస్తులు చేసిన అంచనా ఉన్నది. ఇలా మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తరహాలో వరికి ప్రాధాన్యత ఏర్పడింది.
భారీస్థాయిలో వరిసాగు చేసిన రైతులకు యూరియా రూపంలో కష్టాలు వచ్చాయి. వనపర్తి జిల్లాకు సంబంధించి 26వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ రాష్ట్ర కౌన్సిల్‌కు ప్రతిపాదన పంపింది. ఈమేరకు కేవలం 16వేల మెట్రిక్ టన్నులను మాత్రమే రాష్ట్ర కౌన్సిల్ కేటాయించి ఉత్తర్వులను జారీ చేసింది. వాస్తవంగా 26 వేల మెట్రిక్ టన్నులు కేటాయించినా ఈ పరిస్థితుల్లో సరిపోతుందన్న అంచనా కూడా లేదు. ఆగస్టు నెల నాటికే జిల్లాకు 16వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇక కేవలం మూడు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్ర కౌన్సిల్ కేటాయించిన యూరియా ఉన్నది. ఇది ఎంత మాత్రం సరిపోదని వ్యవసాయ శాఖకు కూడా తెలుసు. అయితే, మళ్లీ స్థానికంగా ఉన్న డిమాండ్‌ను బట్టి రాష్ట్ర కౌన్సిల్‌కు ప్రతిపాదించి కేటాయింపులు పొందాల్సి ఉన్నది. ప్రస్తుతం జిల్లాలో యూరియా నిల్వలు లేవు. శనివారం అగస్టులో వచ్చిన 250 టన్నులు ఉండగా, ఆయా సహకార సంఘాలకు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు.
సెప్టెంబర్ నెలకు సంబంధించిన యూరియా ఇప్పటి వరకు జాడ లేదు. ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం అధికారులకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ సర్కార్‌కు ముందస్తు వ్యూహం లేనందునా ఇంతలా రైతులకు యూరియా సమస్య ఉత్పన్నమైంది. ఈనెలలో జిల్లాకు 6500 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 6 రోజులు గడిచినా ఒకబస్తా కూడా రాలేదు. నేడో, రేపు వస్తుంది అంటూ అధికారులు చెబుతున్నా నమ్మకం లేదు. ఆగస్టు నెలలోనే వచ్చిన యూరియాను శనివారం ఆయా సొసైటీలకు కేటాయించడంతో జిల్లాలో యూరియా నిల్వలు నిల్ అయ్యింది. కేవలం సోసైటీల ద్వారానే యూరియా పంపిణీ అవుతుండటంతో రైతులు నరకం అనుభవిస్తున్నారు.
యూరియా సరఫరా ధరల పరిస్థితిని చూసిన ప్రైవేట్ ఎరువుల డీలర్లు డీడీలు కట్టేందుకు దూరంగా ఉన్నారు.ఇంచుమించు ప్రతి పెద్ద గ్రామంలో ఎరువుల రీటైల్ షాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూరియా అందుబాటులో ఉంటే.. రైతులకు సగం కష్టాలు తప్పుతాయి. అయితే, డీలర్లు యూరియా తెచ్చి విక్రయించేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో 249 మంది రిటైల్ ఎరువుల డీలర్లున్నారు. యూరియా సమస్యపై ప్రతి రోజూ రెండు దఫాలు సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎట్టకేలకు ప్రైవేట్ డీలర్లు కూడా తప్పనిసరి యూరియా విక్రయాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 12 మంది రిటైలర్స్‌కు కలెక్టర్ ద్వారా ఖచ్చితమైన ఆదేశాలు వెళ్లడంతో ప్రైవేట్ డీలర్లు ఆలోచనలో పడ్డారు. ఎంఆర్పీ ధరలకే యూరియాను విక్రయించాలన్న నిబంధనలమేరకు డీలర్లు వెనకా, ముందుకు అవుతున్నారు.
సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించి రెండు రోజుల్లో 500 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. నిన్నటి వరకు ఆగస్టు నెల కోటాలో ఉన్న యూరియా నిల్వలు సరఫరా చేశాం. సొసైటీలు, ఆగ్రో సేవా కేంద్రాలతోపాటు ఎరువుల దుకాణాల రీటైలర్స్ కూడా యూరియాను తప్పనిసరి విక్రయించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా తెప్పించి ఇస్తాం. రైతులు సహకరించాలి.
– ఆంజనేయులు గౌడ్, డీఏవో, వనపర్తి