నర్సాపూర్: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పేరిట కొందరు అక్రమార్కులు మట్టి దందాకు తెర లేపారు. ఇందిరమ్మ ఇండ్లకు మట్టిని తరలిస్తున్నామని చెబుతూ ఆ మట్టిని బయటకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే కాళేశ్వరం కాలువ కోసం తీసిన మట్టి అక్రమార్కుల పారిట వరంగా మారింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని మహమ్మదాబాద్, జక్కపల్లి గ్రామ శివారులో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 18లో భాగంగా గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కాలువ కోసం మట్టిని తోడి ఇరువైపులా కుప్పలుగా వేయడం జరిగింది.
ఇదే అదునుగా చూసిన కొందరు అక్రమార్కులు ఇందిరమ్మ ఇండ్ల కంటూ మట్టిని తీసుకెళ్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాళేశ్వరం కాలువ నిర్మాణ పనుల కోసం వేసిన రోడ్డును అక్రమార్కులు యదేచ్ఛగా వాడుకుంటూ ట్రాక్టర్ జేసీబీల సహాయంతో మట్టిని తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దొరికిందే సందంటూ అక్రమార్కులు మట్టిని తరలిస్తూ వేల రూపాయల దండుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి కాళేశ్వరం మట్టిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.