Virender Sehwag : ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్ ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. అందుకే దాయదుల పోరుకోసం కళ్లలో వొత్తులు వేసుకొని ఎదరుచూస్తారు అభిమానులు. ఇక చిరాకాల ప్రత్యర్థిపై వీరావేశంతో ఆడుతుంటారు టీమిండియా క్రికెటర్లు. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకూ పాక్‌పై రెచ్చిపోయిన ఆడిన ఆటగాళ్లను చూశాం. వీళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా ఒకరు. అది కూడా ఉపవాసం ఉంటూనే శత్రుదేశంపై వీరూ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. దాదాపు పదిహేడేళ్ల క్రితం నాటి మ్యాచ్‌ను గుర్తు చేసుకున్న ఈ మాజీ ఓపెనర్ ఏం చెప్పాడంటే..?
భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. కరాచీలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ప్రత్యర్థి నిర్దేశించిన 302 పరుగుల ఛేదనలో సెహ్వాగ్ విశ్వరూపం చూపించాడు. దూకుడుకు కేరాఫ్ అయిన వీరూ పాక్ ప్రధాన బౌలర్లను ఊచకోత కోస్తూ స్కోర్‌బోర్డును ఉరికించాడు. కేవలం 95 బంతుల్లోనే 119 రన్స్ బాది జట్టు విజయానికి బాటలు వేశాడు. అయితే.. ఆ మ్యాచ్ రోజున సెహ్వాగ్ ఉపవాసం ఉన్నాడట. ఈ విషయం ఇప్పటివరకూ అతడు చెబితేగానీ ఎవరికీ తెలియదు.
‘అవును.. ఆరోజు నేను ఉపవాసం ఉన్నాను. ఖాళీ కడుపుతోనే బ్యాటింగ్‌కు వెళ్లాను. నా ఆకలి తీరాలంటే ఎక్కువ రన్స్ చేయాలి అనుకున్నాను. అనుకున్నట్టే జట్టు విజయానికి తోడ్పడే ఇన్నింగ్స్ ఆడాను’ అని గుర్తు చేసుకున్నాడీ నజఫర్గఢ్ నవాబ్. ఆ మ్యాచ్‌లో 125.6 స్ట్రయిక్ రేటుతో విరుచుకుపడిన వీరూ 12 ఫోర్లు, 5 సిక్సర్లతో శతకగర్జన చేశాడు. దాంతో.. టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
6. Virender Sehwag – 309 vs Pakistan, Multan, 2004 pic.twitter.com/CM2zJUnusL
— Raghu (@IndiaTales7) December 1, 2022
మరో విషయం.. భారత్ తరఫున టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ వీరుడిగా చరిత్ర సృష్టించిన వీరు.. పాక్‌పైనే ఆ రికార్డు సాధించాడు. ఇప్పుడు అతడి కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) సైతం జూనియర్ స్థాయిలో దుమ్మురేపుతున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఈ చిచ్చరపిడుగు తండ్రిని తలపించే బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.