Sridevi | ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచిన ‘బాహుబలి’ సిరీస్ ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా శివగామిగా రమ్యకృష్ణ చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మిగిలిపోయింది. అయితే, ఈ పాత్ర మొదటగా శ్రీదేవి కోసం రాసుకున్న విషయం చాలామందికి తెలిసిందే. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఈ విషయాన్ని గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే శ్రీదేవి పలు డిమాండ్లు పెట్టిందని, అందుకే ఆమెను తీసుకోలేదని అప్పట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.ఇప్పుడు తాజాగా శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ విషయంపై స్పందిస్తూ, అసలు కథ వేరే ఉంది అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
“శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవిని ప్లాన్ చేశారనే మాట నిజమే. రాజమౌళి మా ఇంటికి వచ్చి స్వయంగా కథ చెప్పారు. ఆయనలోని ప్యాషన్ చూసి, శ్రీదేవి నిజంగా ఆ సినిమాలో పనిచేయాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. కథ విన్నప్పుడు ఆమె ఎంత ఎక్సైటెడ్ అయ్యిందో చూసి నేనూ ఆశ్చర్యపోయాను,” అని గుర్తు చేసుకున్నారు.అయితే శ్రీదేవి ఆ పాత్ర చేయలేకపోవడానికి కారణం దర్శకుడు కాదు, నిర్మాతలు అని చెబుతున్నారు. రాజమౌళి వెళ్లిన తర్వాత నిర్మాతలు వచ్చి రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. కానీ, శ్రీదేవి తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కి అది చాలా తక్కువగా ఉండడంతో ఆమె అంగీకరించలేదు. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాకే ఆమెకు ఎక్కువ డబ్బు ఇచ్చారు. అలాంటింది ‘బాహుబలి’కి గొప్ప హైప్ రావాలని కోరుకుంటూ, తక్కువ ఆఫర్ చేయడం అభ్యర్థనీయంగా లేదు,” అన్నారు బోనీ.
“మా పిల్లల వల్ల హోటల్ డిమాండ్ చేయాల్సి వచ్చింది. హోటల్లో ఒక ఫ్లోర్ అడిగిందన్న అంశంపై కూడా బోనీ స్పష్టత ఇచ్చారు. అది ఖచ్చితంగా డిమాండ్ కాదు. మా పిల్లలు చిన్నవాళ్లు, వారితో ఎక్కువ సమయం గడిపేందుకు సరైన ప్రైవసీ కావాలనుకున్నాం. అలాగే పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేయొద్దని కూడా మేము కోరాం. కానీ నిర్మాతలు అవేమీ కుదరదని చెప్పడంతో శ్రీదేవి ఆ పాత్ర చేయనని ఖరాఖండీగా చెప్పేసింది. అయితే నిర్మాత శోభ యార్లగడ్డకి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం ఇష్టముండదు. అందుకే శ్రీదేవిపై లేనిపోని పుకార్లు క్రియేట్ చేసి రాజమౌళిని నమ్మించాడు అని బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వివాదంపై బోనీ కపూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆయన నిర్మాత శోభు యార్లగడ్డను ప్రస్తావిస్తూ, తక్కువ ఖర్చుతో సినిమాను తీయాలన్న ఉద్దేశంతోనే శ్రీదేవిని తప్పించే ప్రయత్నం చేశారని చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇక ఈ ఆరోపణలపై నిర్మాత శోభు యార్లగడ్డ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.