తల్లాడ, సెప్టెంబర్ 17 : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ తహసీల్దార్, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. 15 గుంటల పొలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తల్లాడ మండలంలోని ఓ రైతు నుంచి తహసీల్దార్ రూ.12 వేలు లంచం డిమాండ్ చేయగా.. చివరకు రూ.10 వేలకు అంగీకారం కుదిరింది.
ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వంకాయలపాటి సురేశ్, ఆర్ఐ మాలోతు భాస్కర్‌నాయక్, కంప్యూటర్ ఆపరేటర్ బానోతు శివాజీ.. రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.