మెదక్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఆగస్టు చివరి వారం నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు, వంకలుపొంగిపొర్లాయి. భారీగా నష్టం జరిగింది. పొలాల్లో భారీ ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ప్రాజెక్టులు, చెరువు కట్టలు దెబ్బతినడంతోపాటు వ్యవసాయ క్షేత్రాల్లో రాళ్లు, రప్పలు వచ్చి చేరాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఒక వైపు పంట కొట్టుకుపోయి ఏర్పడిన నష్టం.. మరో వైపు ఇసుక మేటలతో దెబ్బతిన్న పొలాలు దర్శనమిస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఏమి చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.
మెదక్ జిల్లాలో లక్షా 64వేల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో లక్షా 13వేల మంది పనిచేస్తున్నారు. మూడు లక్షల మంది కూలీలు ఉండగా, ఇందులో 2.10 లక్షల మంది ఈజీఎస్ పథకంలో పని చేస్తున్నారు. ఈ వానకాలంలో సుమారు 3.45,214 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 3,01,455 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 34,751 ఎకరాల్లో పత్తి పంట, 2752 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యా యి. మెదక్ జిల్లాలో అత్యధికంగా వరినే రైతులు సాగు చేస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 1200 ఎకరాల్లో మాత్రమే ఇసుక మేటలు ఏర్పడ్డాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 2733 మంది రైతులకు చెందిన ఈ భూముల్లో ఇసుక మేటలను తొలి గించడానికి ఉపాధి హామీ పథకంలో తొలిగిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికి పలు నిబంధనలు విధిస్తున్నారు.
బాధిత రైతుకు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండాలని, ఒక్కో రైతుకు రెండు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఏర్పడిన ఇసుక మేటలను తొలిగిస్తామని చెబుతున్నారు. గరిష్టంగా ఆరు వందల క్యూబిక్ మీటర్ల ఇసుక తొలిగిస్తామని పేర్కొంటున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబ్ కార్డు లేని వారు, రెండు ఎకరాల పైన ఉన్న రైతులు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎన్ని ఎకరాల్లో ఇసుక మేటలు ఉన్నా ప్రభుత్వమే తొలిగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వరి పంటలతో పాటు పత్తి, మొక్కజొన్న పంటల్లో నష్టం జరుగుతుందని వాపోతున్నారు.
భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని మెదక్, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, రేగోడ్, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట హవేళీఘనపూర్, రామాయంపేట, నర్సాపూర్ తదితర మండలాల్లో వరితో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2733 మంది రైతులకు సంబంధించిన 1200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు అంచనా వేశారు.
పంట పొలాల్లో ఇసుక మేటలు ఉన్న రైతులకు ఈజీఎస్ పథకం ద్వారా తొలిగిస్తాం. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2733 రైతులకు సంబం ధించి 1200 ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్ప డ్డాయి. నిబంధనల ప్రకారమే 600 క్యూబిక్ మీటర్ల ఇసుక తొలిగిస్తాం.
-శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో మెదక్