ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల పార్టీ కార్యాలయాల్లో భరతమాతకు పూల మాలలు వేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో చైతన్య దీప్తిని రగిల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వారిది ప్రజా పాలన కాదని.. ప్రజావ్యతిరేక, నియంత, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు.
ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నదని వాపోయారు. రైతులకు యూరియా అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. అన్ని వర్గాలను గోస పెడుతున్నదని వాపోయారు. తమ హక్కులు సాధించుకునేందుకు ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హనుమకొండ, ములుగులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్, కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా.. శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.