మక్తల్ : ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చిన సమయంలో కరెంటు కోతలతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడని నిరసిస్తూ మక్తల్ ( Maktal ) ఉప విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి జాతీయ రహదారిపై ధర్నా ( Dharna ) చేపట్టారు. మండలంలోని సంగం బండ, మద్వార్ గ్రామాలకు చెందిన రైతులు కార్యాలయాన్ని ముట్టడించి, సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ధర్నాకు దిగారు. అనంతరం సబ్ స్టేషన్ ఎదుట 167 జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు.
రైతులు లక్ష్మి కాంత్ రెడ్డి, సంతోష్ రెడ్డి, అంజప్ప, అర్జున్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని వాపోయారు. అసలే వర్షాకాలంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నకు, కరెంటు కోతలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ధర్నా విషయాన్ని తెలుసుకున్న మక్తల్ సీఐ రామ్ లాల్ మక్తల్ పట్టణ రెండో ఎస్సై రేవతి రైతుల వద్దకు చేరుకుని మాట్లాడారు. విద్యుత్ అధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో రైతులు ఆందోళనను విరమించారు.