Vijayawada – Singapore | విజయవాడ నుంచి సింగపూర్‌కు నవంబర్ 15వ తేదీ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రవాస తెలుగువారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలోనే సింగపూర్ నుంచి విజయవాడకు డైరెక్ట్ సర్వీసులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల్లోనే విమాన సర్వీసులను ప్రారంభిస్తుండటం పట్ల రత్నకుమార్ కవుటూరు హర్షం వ్యక్తం చేశారు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సౌకర్యం తెలుగు ప్రవాస భారతీయులకు విశేష ప్రయోజనం కలిగించడమే కాకుండా వ్యాపార, సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విమానయాన పటంలో గౌరవప్రదంగా నిలబెట్టే మైలురాయిగా నిలుస్తుందన్నారు. సింగపూర్‌లోని తెలుగువారికి మరిన్ని అవకాశాలు కల్పించేలా వైమానిక అనుసంధానాన్ని విస్తరించేందుకు మీరు చేపడుతున్న ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు.