Viksit Bharat Run | వికసిత్ భారత్ పరుగును బ్రూనైలోని భారత రాయబార కార్యాలయం విజయవంతంగా నిర్వహించింది. భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు, బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.
వికసిత్ భారత్ 2047 దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది. ఈ సందర్భంగా వికసిత్ భారత్ రన్లో పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని మాట్లాడుతూ.. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. వారు నిరంతరం భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని, ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమం ఘనవిజయవంతం కాగా, వికసిత్ భారత్ దిశగా బ్రూనైలోని భారతీయ సమాజం యొక్క భాగస్వామ్య భావనను ప్రతినిధ్యం వహించింది.