మాజీ సర్పంచులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెండు విడతల్లో సుమారు రూ.29.75 కోట్లు విడుదల చేసింది. అయితే పెండింగ్ బిల్లుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మాజీ సర్పంచులకు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపిస్తోంది. ముందుగా 2022-23 ఆర్థిక సంవత్సరం పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రత్యేకాధికారుల పాలనలోని పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిప్రకారం చేస్తే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఎగనామం పెడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చి సర్పంచులుగా పనిచేసిన మాజీలు పెండింగ్ బిల్లులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నోట్లో మట్టి కొట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమకు పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే పోరాటం తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– అశ్వారావుపేట, మార్చి 8
“రూ.40 కోట్లకుపైనే పెండింగ్ బిల్లులు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగానే పెండింగ్ బిల్లులు ఉంటాయని మాజీ సర్పంచుల అంచనా. జిల్లాలోని 22 మండలాల్లో 471 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ఒక్కో పంచాయతీకి సుమారు 4 నుంచి రూ.6 లక్షలు, మేజర్ పంచాయతీల్లో 15 నుంచి రూ.20 లక్షలకుపైనే పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఈ లెక్కన జిల్లాలో సుమారు రూ.40 కోట్లకు పైగానే మాజీ సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.”కూరలో కరివేపాకులా తయారైంది మాజీ సర్పంచుల పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారి ‘పెండింగ్ బిల్లులు’ చెల్లించడం లేదు. కొత్త పాలకవర్గాలు బిల్లుల చెల్లింపునకు విముఖత వ్యక్తం చేస్తుండటంతో మాజీలు మదనపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సుమారు రూ.29.75 కోట్ల నిధులు విడుదల చేసింది. జిల్లాలోని 471 గ్రామ పంచాయతీలకు సుమారు రూ.40 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నట్లు మాజీ సర్పంచులు అంచనా వేస్తున్నారు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు 2024 జనవరి వరకు పదవుల్లో ఉన్నారు. పదవీకాలం ముగియడంతో మాజీలయ్యారు.
ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో అప్పులు చేసి మరీ పంచాయతీల అభివృద్ధి, ఇతర అవసరాలకు సొంత డబ్బులు వెచ్చించారు. పదవీకాలం పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఎప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని భావించిన అప్పటి సర్పంచులు పదవీకాలంలో అప్పులు చేసి మరీ పల్లెల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారు. మాజీలయ్యే నాటికి చేసిన అప్పులకు తోడు వడ్డీలు పెరిగిపోయి ఆర్థికంగా బాగా నష్టపోయారు. కొత్త పాలకవర్గాలు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందిలే.. అప్పుడైనా పెండింగ్ బిల్లులు తీసుకోవచ్చని ఎదురుచూస్తూ వచ్చారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో సుమారు రెండేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేదు. గత ఏడాది డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు పూర్తికావటంతో కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.29.75 కోట్లు విడుదల చేసింది.
బిల్లుల చెల్లింపునకు విముఖత..
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, కొత్త సర్పంచులు వచ్చిన నిధులను పాత బిల్లులకు చెల్లిస్తే పంచాయతీల అభివృద్ధి ఎలా అంటూ విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ప్రత్యేకాధికారుల పాలనలో చేసిన పనులకు బిల్లులు రాబట్టుకునేందుకు అప్పటి అధికారులు, గ్రామ కార్యదర్శులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా అధికారులు కూడా ముందుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లించి మిగిలితే మాజీ సర్పంచులకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పెండింగ్ బిల్లులు అందకపోతే భవిష్యత్‌లో కూడా వచ్చే గ్యారెంటీ ఉండదని మాజీ సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు విడుదలైన నిధుల నుంచే తమ బిల్లులు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. నిధుల చెల్లింపుపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మొన్నటివరకు నిధుల కోసం ఎదురుచూశాం. ఇప్పుడు నిధులు విడుదలైనా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అధికారులు ప్రాధాన్యతనివ్వడం లేదు. ప్రత్యేకాధికారుల పాలనలోని బిల్లులు మాత్రమే మొదట చెల్లిస్తున్నారు. మిగిలితే మాజీ సర్పంచుల బిల్లులు చెల్లిస్తారట. ముందు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే మిగతా చెల్లింపులు చేయాలి. లేకుంటే మాజీ సర్పంచులమంతా ఏకమై పోరాటం చేస్తాం.
పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యతనిస్తున్నాం. మాజీ సర్పంచుల బిల్లులు కూడా చెల్లిస్తాం. ముందుగా 2024-25 ఆర్థిక సంవత్సరం బిల్లులు చెల్లిస్తున్నాం. ప్రాధాన్యత వారీగా పెండింగ్ బిల్లులన్నింటికీ చెల్లింపులు చేస్తాం. రెండు విడతల్లో జిల్లాకు రూ.29.75 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
– సుధీర్‌కుమార్, ఇన్చార్జి డీపీవో, కొత్తగూడెం