Viral news : అతడు తన దూరపు బంధువు దగ్గర పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఓ మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి ఖర్చులకు ఇద్దరి దగ్గరా డబ్బులు లేవు. దాంతో తన బంధువైన యజమాని ఇంట్లో అతడు దొంగతనానికి పాల్పడ్డాడు. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని హెబ్బగోడి (Hebbagodi) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రేయాస్ అనే 22 ఏళ్ల యువకుడు తన బంధువు అయిన హరీష్‌కు సంబంధించిన దుకాణంలో పనిచేస్తున్నాడు. హరీష్ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. శ్రేయాస్‌కు నాలుగేళ్ల క్రితం ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ప్రేమలోపడ్డ ఇద్దరూ ఘనంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అందుకు సరిపడా వాళ్ల దగ్గర డబ్బులు లేవు. దాంతో శ్రేయాస్ దొంగతనానికి ప్లాన్ చేశాడు.
అందుకు తన బంధువు, యజమాని అయిన హరీష్ ఇంటిని ఎంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం హరీష్ ఇంట్లో చొరబడి భారీగా బంగారం, నగలు దోపిడీ చేశాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో చొరబడి 416 గ్రాముల బంగారం, రూ.3.46 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. దాంతో తన ఇంట్లో దోపిడీ జరిగిందని హరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రేయాస్ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో శ్రేయాస్ నిజం ఒప్పుకున్నాడు. పెళ్లి ఘనంగా చేసుకుందామనే దొంగతనానికి పాల్పడినట్లు తెలిపాడు.