వరంగల్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు’ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుండబద్దలుకొట్టారు. తాము ఏదిచేసినా నేరుగా పార్టీ అధిష్ఠానానికి చెప్పే చేస్తామని తేల్చిచెప్పారు. తన శాఖలో ఏది జరిగినా తనకు, తన కార్యదర్శి నోటీసులో ఉండాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. సురేఖ మంగళవా రం వరంగల్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేడారం పనుల విషయంలో మంత్రుల్లో అభిప్రాయభేదాలు పొడచూప డం, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సురేఖ సహా మరో మంత్రి సీతక్క పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేశారనే వార్తలు వచ్చి న నేపథ్యం లో ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హనుమకొండలోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా, డీసీసీ భవన్లో సురేఖ మా ట్లాడారు. ఇటీవలి కొన్ని పరిణామాలను చూస్తుంటే తమను, తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారని సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరినో ఏదో చేయడానికి తాము ఢిల్లీ, హైదరాబాద్‌లో లాబీయింగ్ చేయాల్సిన అవసరంలేదని అన్నారు.
మేడారం టెండర్ల విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు లేవని తెలిపారు. పనుల కోసం మూడు ప్రధాన కంపెనీలు టెండర్లు వేశాయ ని, అందులో ఎవరి అర్హత వారికి ఉంటుందని చెప్పారు. తన శాఖలో చేసే పనులు పారదర్శకంగా ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. పొంగులేటి మే డారం సమీక్షకు హాజరుకాకపోవడంపైనా ఆమె స్పందించారు. ‘వేరే కార్యక్రమాలు ఉండగా, కొన్నింటిని రద్దు చేసుకునే హక్కు మాకున్నది. అందుకే హాజరు కాలేదు. దానిపై వాళ్లేమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు’ అని తెలిపారు.