వరంగల్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి సహచర మంత్రుల అభిప్రాయాలను కాలరాసి రేవంత్ సర్కార్ తన ఇష్టానుసారంగా ఒక మంత్రి కి రూ.72 కోట్ల పనులను అప్పగించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నది. మరోవైపు పెసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ గిరిజనేతరులకు పను లు అప్పగించడం ఏమిటని ఆదివాసీ గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టుల కోసం తాను ఆశపడనని, తన స్థాయి ఏమి టో అందరికీ తెలుసునని ఇటీవల ఓ మంత్రి చేసి న వ్యాఖ్యలను బట్టి ఆ పనులు సదరు మంత్రికే దక్కాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మే డారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ మహాజాతరను పురస్కరించుకొని ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. అందులో భాగం గా అమ్మవార్ల గద్దెలు, ప్రాకారం, పరిసరాలను రాతితో నిర్మించేందుకు రూ.71,80,61,925 అవసరమవుతాయని అంచనా వేసి టెండర్లు పిలిచింది. టెండర్లలో మూడు కంపెనీలు పాల్గొనగా, ఒక కంపెనీకి పనులు దక్కాయని, ఆ కంపెనీ ఓ మంత్రిదనే ప్రచారం జరుగుతున్నది.
ఈ వివాదాలు ఆధిపత్య పోరులో భాగమా? లేక లాభనష్టాలను బేరీజు వేయడంలో భాగ మా? అని అంటే అవి రెండూ అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పక్క జిల్లా మంత్రి తమ జిల్లా రాజకీయాల్లో తలదూర్చి ఏ ఇద్దరినీ కలువకుండా చేస్తున్నారని, ఆ మంత్రి పెత్తనం అవసరమా? అనే కోణంలో ఒక మంత్రి, అసలు ఆ పనులను తమకు అప్పగిస్తే తామే తమ వారికి కట్టబెట్టేవారం కదా అనే అభిప్రాయంతో మరో మంత్రి.. ఇలా ఇద్దరు మంత్రు లు మరో మంత్రి ఆధిపత్యంతో ఇబ్బందులపాలు అవుతున్నారనే ప్రచారం సాగుతున్నది.
పెసా చట్టం, 1/70 చట్టం, 109 జీవో ఇలా ఏది చూసినా షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతరు లు పనులు చేయడానికి విరుద్ధం. చట్టాలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే కోట్లాది రూపాయల పనులను విభజించి నిర్దేశిత నియమాల ప్రకారం వాటిని విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్ (వీటీడీఏ)ల ద్వారా చేపట్టాలి. మేడారంలో పనుల అప్పగింత అలా జరగలేదని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
షెడ్యూల్డ్ ఏరియాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టాలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కుతున్నదని, అందుకే మంత్రికి పనులు అప్పగించారనే విమర్శలు వస్తున్నాయి. వీటీడీఏల పనుల విలువను రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచిందని, మే డారంలో చేపట్టే పనులను విభజించి అప్పగించాల్సి ఉన్నా రేవంత్ సర్కార్ అలా చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.