బెంగళూరు, అక్టోబర్ 14: గుంతలు పడిన రోడ్లు, ఎటు చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్న బెంగళూరు దుస్థితి మరోసారి వార్తల్లో నిలిచింది. బెంగళూరును సందర్శించిన ఓ విదేశీ అతిథి నుంచి తనకు ఎదురైన ప్రశ్నను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా నెటిజన్లతో పంచుకున్నారు. బెంగళూరు రోడ్లు మాత్రమే కాదు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను గురించి చైనా నుంచి వచ్చిన ఆ సందర్శకురాలు వేసిన ప్రశ్నను ఆయన భారతీయుల దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. బయోకాన్ పార్కుకు వ్యాపారం నిమిత్తం ఓ సందర్శకురాలు వచ్చారు. అప్పుడు ఆమె నాతో ‘రోడ్లు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నాయి.. ఎటుచూసినా ఎందు కు ఇంత చెత్త ఉంది? పెట్టుబడులకు మద్దతు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా? నేను చైనా నుంచి వచ్చాను. సానుకూల పవనాలు వీస్తున్న తరుణంలో భారత్ కలసికట్టుగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు’ అని అన్నారు అని కిరణ్ మజుందార్ షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ పోస్టు వైరల్ కావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైభవ్ గోయల్ జవాబిస్తూ ప్రజాస్వామ్యానికి ఊపిరిలాంటి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు జవాబుదారీతనం తీసుకువస్తాయనుకోవడం భ్రమ అని తేలిపోయిందని అన్నారు. వ్యక్తిగత దురాశే సమాజంలో సమష్టి బాధ్యత కన్నా శక్తివంతంగా ఉందని, ఎన్నికల క్రీడ పరిస్థితిని మరింత దుర్భరం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలా క్యాపిటల్ సీఈఓ విజయ్ సప్పని స్పందిస్తూ భారత్‌ను చైనాతో ఎన్నటికీ పోల్చలేమని, అది మనకన్నా ఎన్నో దశాబ్దాల ముందుందని చెప్పారు. పౌర స్పృహ విషయంలో మనకన్నా శ్రీలంక, భూటాన్, నేపాల్ చాలా ముందున్నాయని ఆయన తెలిపారు. భారత్‌లోని ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.