హైదరాబాద్, సిటీబ్యూరో, అక్టోబర్14(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో మళ్లీ అలజడి! ఇప్పటికే అవినీతి ఆరోపణలతో మసకబారిన హెచ్‌సీఏలో బర్త్ సర్టిఫికేట్ల స్కామ్ సంచలనం రేపుతున్నది. నిబంధనలను పూర్తిగా తుంగులో తొక్కుతూ వేర్వేరు విభాగాల్లో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు కల్గిన ప్లేయర్లను ఎంపిక చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఏడాది క్రితం సరిగ్గా ఇదే విషయంలో బీసీసీఐ ఆరుగురు ప్లేయర్లపై రెండేండ్ల పాటు విధించిన నిషేధం నుంచి పాఠాలు నేర్వని హెచ్‌సీఏ పాలకవర్గం మరోమారు అక్రమ మార్గంలో ప్లేయర్లను ఎంపిక చేసింది. దీనిపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేయాలంటూ అనంతరెడ్డి అనే వ్యక్తి మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.
ఇందులో ఆయన కీలక అంశాలు పొందుపరిచాడు. ‘ఒక ప్లేయర్‌కు రెండు బర్త్ సర్టిఫికెట్లు ఎలా ఉంటాయి? గతంలో వాటిని పరిశీలించి ఫేక్ అని ధృవీకరించారు. కానీ సెలెక్టర్లు మళ్లీ వాళ్లను తిరిగి జట్టుకు ఎంపిక చేయడం సరైంది కాదు’ అని అనంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు వినూ మన్కడ్ ట్రోఫీ టీమ్ ఎంపిక ప్రక్రియలో హెచ్‌సీఏ నిర్వాహకులు, సెలెక్షన్ కమిటీ అవినీతి అక్రమాలకు పాల్పడిందని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌కుమార్ రాచకొండ సీపీకి మరో ఫిర్యాదు చేశారు.