సుబేదారి, అక్టోబర్ 14 : ఎస్సై దాష్టీకానికి ఓ అమాయకుడు నరకం చూస్తున్నాడు. మద్యం తాగి పక్క సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న యువకుడిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తానని చిత్రహింసలకు గురిచేశాడు. కేసు నుంచి తప్పించేందుకు రూ.లక్ష లంచం తీసుకోవడమే గాక గంజాయి కేసులో ఇరికించాడు. ఎస్సై దౌర్జన్యాన్ని ఎదుర్కోలేక ఆ యువకుడు తల్లడిల్లిపోతున్నాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్‌జోన్ పరిధి ఖమ్మం రోడ్డులోగల ఓ పోలీస్ స్టేషన్ ఎస్సై నాలుగు రోజుల క్రితం రాత్రి సమయంలో వాహనాలు తనిఖీలు చేపట్టాడు. ఐనవోలు మండలానికి చెందిన యువకుడు తన స్నేహితుడితో కలిసి మద్యం తాగి ఊరి నుంచి కారులో వరంగల్‌కు వస్తుండగా పట్టుబడ్డారు.
కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని వదిలిపెట్టి, పక్క సీట్లో కూర్చున్న యువకుడిని పోలీసుస్టేషన్ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశాడు. రూ.లక్ష ఇస్తేనే వదిలిపెడుతానని లేదంటే జైలుకు పంపిస్తానని బెదిరించాడు. ఆ యువకుడు మరుసటిరోజు ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో గోల్డ్ చైన్ కుదవబెట్టి రూ.లక్ష తీసుకొని అదే గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ లీడర్ మధ్యవర్తిత్వంలో ఎస్సైకి ముట్టజెప్పాడు. డబ్బులు తీసుకున్న రెండు రోజుల తర్వాత సదరు ఎస్సై ఆ యువకుడి వద్ద 8 గ్రాముల గంజాయి దొరికినట్టు కేసు పెట్టాడు. దీంతో బాధిత యువకుడితోపాటు మధ్యవర్తిత్వం వహించిన యూత్ కాంగ్రెస్ నాయకుడు షాక్‌కు గురయ్యారు. ‘కేసు పెట్టనని చెప్పి డబ్బులు తీసుకున్నారు.. గంజాయి కేసు ఎలా పెడుతారు?’ అని సదరు యూత్ లీడర్ ఎస్సైని ప్రశ్నించాడు. ‘పోలీసు అంటే ఇదే, పాత కేసులో నన్ను కలువలేదు కదా?’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
పాత కేసులో కలవలేదనే కోపంతో..
సదరు యువకుడు ఏడాది క్రితం గంజాయి తాగి, ఆ ఎస్సైకి పట్టుబడ్డాడు. అప్పుడు తెలిసిన వారితో కేసు కాకుండా అప్పటి ఇన్స్పెక్టర్తో చెప్పించుకున్నా ఆ యువకుడిపై గంజాయి తాగిన కేసు నమోదైంది. ‘పాత కేసులో నన్ను కలువలేదు.. సీఐనే కలువస్తవా? నాకు డబ్బులు ఇవ్వ రా?’ అంటూ సదరు ఎస్సై.. బదిలీ అయిన ఇన్స్పెక్టర్ పేరు ప్రస్తావిస్తూ, ఆ యువకుడి కాలు కమిలిపోయేలా కొట్టాడు. డబ్బులు ఇచ్చినట్టు ఎవరికైనా చెబితే వేరేలాగా ఉంటుందని హెచ్చరించాడు. తాజాగా తీసుకున్న రూ.లక్షలో రూ.30 వేలు ఎస్సై, రూ.70 వేలు ఇన్స్పెక్టర్ పంచుకున్నట్టు సమాచారం. ఎస్సై, ఇన్స్పెక్టర్పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి బాధిత కుటుంబం సిద్ధమైనట్టు తెలిసింది. బాధిత యువకుడు బీటెక్ చదివి లండన్‌కు వెళ్లి, రెండేళ్ల క్రితం సొంత ఊరికి వచ్చి, వరికోత మెషిన్‌తో ఉపాధి పొందుతున్నాడు.