న్యూఢిల్లీ, అక్టోబర్ 14: జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థలకు పెండింగ్లో ఉన్న వేలాది కోట్ల బకాయిలను విడుదల చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామీణ భారతంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ల ద్వారా సురిక్షత నీరును అందచేయడమే జేజేఎం లక్ష్యం. గడచిన 10-12 నెలలుగా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని, దీని వల్ల కార్యక్రమానికి సంబంధించిన పనులు కొనసాగించడం కష్టతరంగా మారిందని అసోచామ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చింది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం, జమ్ము కశ్మీరుతోసహా అనేక రాష్ర్టాలలో చెల్లింపులు జరగడం లేదని పరిశ్రమల సంఘం తెలిపింది. నెలలల తరబడి వేల కోట్ల రూపాయల చెల్లింపులు నిలిచిపోయాయని పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక్క యూపీలోనే రూ. 11,000 కోట్ల మేరకు బకాయిలు పెండింగ్లో ఉండగా జార్ఖండ్లో 3,800 కోట్లు, ఒడిశాలో రూ.2,500 కోట్లు, పశ్చిమ బెంగాల్లో రూ. 5,000 కోట్లు, మహారాష్ట్రలో రూ.12,500 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపింది. దీర్ఘకాలం బిల్లుల చెల్లింపులు జరగకపోవడం ఇంటింటి నల్లా కనెక్షన్ల పనుల వేగాన్ని దెబ్బతీస్తోందని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2.90 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్లను కల్పించగా 2024-25లో కేవలం 94 లక్షల నల్లా కనెక్షన్లను మాత్రం ఇవ్వడం జరిగిందని, ఇది దాదాపు 70 శాతం క్షీణతని అసోచామ్ తెలిపింది.