హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): ఓటర్లకు చీరలు, కుక్కర్లు, మందుబాటిళ్లు, డబ్బులు పంచటం సాధారణంగా కనిపించేదే. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రలోభాలు హైటెక్ పద్ధతిలో కొనసాగాయి. హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఓటరుకు ముట్టజెప్పడం అచ్చం మాఫియాను తలపిస్తున్నది. జూబ్లీహిల్స్ బస్తీల్లో ఇంటింటికి డబ్బులు ఎలా పంచుతున్నారో తనకు ఎదురైన అనుభవాన్ని కండ్లకు కట్టినట్టు వివరిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడిట్‌లో పోస్ట్పెట్టగా అది వైరల్‌గా మారింది.
జూబ్లీహిల్స్‌లో ఓట్ల కొనుగోలు, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు మొత్తం పోలీసులు, ఎన్నికల అధికారులకు తెలిసే జరుగుతున్నాయని సదరు ఓటరు ఆరోపించారు. ఇంత దారుణంగా డబ్బుల పంపిణీ జరిగిపోతుంటే… చెక్‌పోస్టులు ఎందుకు? సాధారణ ప్రజల వాహనాలను తనిఖీ చేయడమెందుకు? అని ప్రశ్నించారు. మరణం అంచుల్లో ఉన్న కాంగ్రెస్సే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంకెంత చేయగలదో ప్రజలే ఆలోచించాలని కోరారు. ప్రధాని మోదీ ఓట్‌చోర్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలను కూడా ప్రస్తావించారు. మోదీ ఓట్ చోర్ అయితే.. రాహుల్‌గాంధీ ఓట్ల కొనుగోలుదారుడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు తనకు ఇచ్చిన రూ.2500 పేదవాడైన తన వాచ్‌మ్యాన్‌కు ఇచ్చానని ఆ పోస్టులో పేర్కొన్నారు.