హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు విధించిన గడువు లోపల ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన తెలంగాణ శాసనసభాపతి, జ్యుడీషియల్ ట్రిబ్యునల్ చైర్మన్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై తక్షణం చర్య తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పక్షాన న్యాయవాది మోహిత్‌రావు సోమవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసును ట్రిబ్యునల్ చైర్మన్‌గా మూడు నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు గత జూలై 31న స్పీకర్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది.
సుప్రీంకోర్టు విధించిన గడువులో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణను పూర్తిచేయలేదు. ఆయన కేవలం విచారణ ప్రక్రియను మాత్రమే ప్రారంభించారు. ఈ క్రమంలో సగం మంది ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తికాలేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ప్రసాద్‌కుమార్ సరైన చర్యలు తీసుకోవడం లేదని, ఆయనపై కోర్టు ధిక్కరణ చట్టం సెక్షన్ 2(బీ), సెక్షన్ 12 ప్రకారం తక్షణం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆ పిటిషన్లో కోరారు. తమ పిటిషన్‌ను అత్యవసరమైనదిగా పరిగణించి విచారణ జరిపించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని కోరారు.
స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణ నిర్వహించలేదని, తద్వారా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్‌రావు ధర్మాసనం ఎదుట ఉంచారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా కేసు విచారణను ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నదని, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం ధిక్కారమే అవుతుందని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణను ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అంశంలో తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ మీనమేషాలు లెక్కిస్తున్నారని, జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించడంలేదని బీఆర్ఎస్ తన పిటిషన్లో ఆరోపించింది. స్పీకర్ ఏలాంటి చర్యలు తీసుకోనందున సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరింది.
న్యాయస్థానం విధించిన గడువులోగా చర్యలు తీసుకోవడంలో స్పీకర్ విఫలమైనందున సుప్రీంకోర్టు ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు న్యాయవాది మోహిత్‌రావు మరో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టే స్వయంగా రంగంలోకి దిగి రాజ్యాంగాన్ని రక్షించాలని, కోర్టే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై కూడా వచ్చే సోమవారమే విచారణ చేపడతామని కోర్టు పేర్కొన్నది.