రవీంద్రభారతి, నవంబర్ 10 : స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు ఇచ్చారు. సోమవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో 8 బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బానాల అజయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన కోసం ‘హలో బీసీ చలో ఢిల్లీ’కి ఆర్ కృష్ణయ్య పిలుపు ఇచ్చారు. డిసెంబర్ 10న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో చట్టసభల్లో 50% రిజర్వేషన్ల సాధన కోసం జాతీయ స్థాయి బీసీ నాయకులతో భారీ సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సెమినార్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొంటారని, భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు. జాతీయ బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి డిసెంబర్లో జరిగే శీతాకాలం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా ఒత్తిడి తీసుకువస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిపై ఒత్తిడి పెంచాలని కోరారు. 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇచ్చినప్పుడే ఎన్నికలకు వెళ్లాలని, లేకుంటే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తే ఓర్వలేని రెడ్డి జాగృతి నేతలు కోర్టు ద్వారా స్టే ఇప్పించారని ధ్వజమెత్తారు.