సిటీ బ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తున్నది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తున్నది. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో గెలుపు ఓటములపై తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు. జన సందోహ ప్రాంతాలు, బస్స్టాండ్లు, హోటళ్లు, టీస్టాళ్లు, రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో దీనిపైనే చర్చ జరుగుతున్నది.
గెలుపోటములను ఖరారు చేసే అంశాలపై విపరీతంగా విశ్లేషించుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ రెండేండ్ల విధ్వంసం, కేసీఆర్ పదేండ్ల అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్నది. జూబ్లీహిల్స్ తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ భవితవ్యం తేలనున్నట్లు మాట్లాడుకుంటున్నారు. మరికొంత మంది రేవంత్‌రెడ్డి, కేసీఆర్ సెంట్రిక్‌గానే ఈ ఉప ఎన్నికలో ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
పాలన తీరుపైనే ప్రజా తీర్పు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధానంగా కేసీఆర్ పదేండ్ల సుపరిపాలన, రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనను ప్రామాణికంగా తీసుకుంటారనే చర్చ ఎక్కువగా వినిపిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత తొలిసారి సీఎంగా అధికారం చేపట్టిన తెలంగాణను కేసీఆర్ ఏవిధంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారనేదే ఓటర్లను ప్రభావితం చేస్తున్నదని మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు జూబ్లీహిల్స్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌ను దేశానికే తలమానికంగా మార్చిన బీఆర్ఎస్కు ఓటేస్తామని చర్చించుకుంటున్నారు.
రెండేండ్లలో హైడ్రా విధ్వంసం, కరెంట్ కోతలు, నల్లా బిల్లులతో కాంగ్రెస్ ప్రజలను వేధించిందని, ఓటేసి గెలిపిస్తే తమను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఓటర్లు మాట్లాడుకుంటున్నరు. మాగంటి గోపీనాథ్ అందించిన చేయూత వల్ల లబ్ధిపొందిన వారు తమ ఓటును మాగంటికి అంకితం ఇస్తామంటున్నారు. అధికార కాంగ్రెస్ ఎన్ని డబ్బులు పంచినా ఓటర్లు అభివృద్ధికే ఓటేస్తారని మేధావులు, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత ఇక్కడ ప్రతిబింబిస్తుందని విశ్లేషిస్తున్నారు. సర్వేలు కూడా ప్రజాతీర్పునకు అనుగుణంగా వస్తున్నాయని అంటున్నారు. అటు చిన్న శ్రీశైలం యాదవ్ బాధితులు కూడా ఓటుతో ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి ఈ ఉప ఎన్నిక తీర్పుపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసే వారికి ఓటు వేయాలని విశ్లేషకులు ఓటర్లకు సూచిస్తున్నారు.