సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీపడేదే లేదని, వారి రక్షణ, సామాజిక బాధ్యతగా భావించి భద్రతపై అవగాహన కల్పించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ ఆడిటోరియంలో మహిళాభద్రత విభాగం పనితీరుపై సజ్జనార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ విభాగంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు. షీటీమ్స్, భరోసా, యాంటీహ్యూమన్ ట్రాఫికింగ్, జువెనైల్ తదితర విభాగాల అధికారులతో మాట్లాడి వారి పనితీరును ఆరాతీశారు.
మహిళలు, పిల్లల భద్రత విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై సీపీ పోలీసులకు దిశానిర్దేశం చేశారు. మహిళలు బాధతో పోలీస్స్టేషన్లకు వస్తారని, వారితో మానవతాదృక్పథంతో వ్యవహరించాలని, అన్యాయం జరిగిందని వచ్చే మహిళకు తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలన్నారు. కేవలం కేసులు నమోదు చేసి వదిలేయొద్దని, సమగ్రంగా దర్యాప్తు చేయాలని, పోక్సో, అత్యాచార కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.
మహిళా భద్రతపై అవగాహన కల్పించాలని, చిన్నపిల్లలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్, స్వీయ రక్షణ వంటి విషయాలు నేర్పించాలని చెప్పారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ అప్పుడే కాకుండా మిగతా సమయాల్లోనూ వీధి బాలలు, వెట్టిచాకిరి, పరిశ్రమల్లో మగ్గుతున్న బాల కార్మికులను రక్షించాలని ఆదేశించారు. ఆడపిల్లల జోలికొస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని, వారికి పాస్‌పోర్ట్ మంజూరు కాదని, ప్రభుత్వ ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో క్రైమ్స్ అదనపు సీపీ శ్రీనివాస్, డీసీపీ లావణ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
అందెశ్రీకి సజ్జనార్ ఘననివాళి..
హైదరాబాద్ లాలాపేటలోని జీహెచ్ఎంసీ ఆచార్య జయశంకర్ గ్రౌండ్లో ప్రముఖ కవి అందెశ్రీ భౌతికకాయానికి సోమవారం హైదరాబాద్ సిటీపోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.