రామగిరి, నవంబర్ 10: 2018లో ఓ గర్భిణి మృతికి కారణమైన కేసులో బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని నల్లగొండ జిల్లా వినియోగ దారుల ఫోరం నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. వినియోగదారుల ఫోరం చైర్మన్ క్రిష్టోఫర్, సభ్యులు ఎస్ సంధ్యారాణి, కేతేపల్లి వెంకటేశ్వర్లుతో కూడిన ధర్మాసనం గత అక్టోబర్ 30న తీర్పు వెలువరించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిట్యా ల మండలం ఆరెగూడెంకు చెందిన అస్నాల స్వాతిని ప్రసూతి కోసం 9 జూలై 2018న నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
ఆమెకు 13వ తేదీ రాత్రి సర్జరీ చేశారు. రెండుసార్లు మత్తు మందు ఇవ్వడంతో వైద్యం వికటించడంతో 14వ తేదీన మృతిచెందింది. ఈ వ్యవహారంపై అనుమానంతో స్వాతి కుటుంబ సభ్యులు 2 ఫిబ్రవరి 2021న నల్లగొండ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. సుదీర్ఘంగా వాదనలు విన్న ఫోరం చైర్మన్, సభ్యులు.. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని కామినేని దవాఖాన యాజమాన్యాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించారు.