ఘట్కేసర్, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్లో నిర్వహించనున్నట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూచౌదరి తెలిపారు. ఘట్కేసర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం అంత్యక్రియల నిమిత్తం కేటాయించిన స్థలాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ చక్రపాణితోపాటు అయా శాఖల అధికారులు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు 20 గుంటల స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య చర్యలు.. వంటి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎన్‌ఎఫ్‌సీనగర్ కాలనీలోని అందెశ్రీ నివాసం వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ రాజేష్, తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం, సామాజికవేత్త జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ జంపాల రమేశ్, నాయకులు లింగస్వామి, వెంకటనారాయణ, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.